Saturday, September 11, 2010

మట్టి వినాయకుడిని పూజిస్తే చాలా...?!

ఈ వినాయక చవితి కి మట్టి వినాయకులనే పూజించాలని మీడియా లోను, బయట ప్రచారం బాగా జరిగింది. ఇది సక్సెస్ కూడా అయ్యింది. ఇలా చేయడం వలన పర్యావరణ పరిరక్షణ జరుగుతుందనేది ఎవరు కాదనలేనిది. సంవత్సరానికి ఒకసారి వచ్చే వినాయక చవితికి ఇలా చేస్తే సరిపోతుందా? మరి రోజురోజుకూ పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్,అంతకంతకు తరుగుతున్న ఖనిజ సంపదల మాట ఏమిటి?

ఈ రెండు సమస్యలను పెంచి పోషిస్తున్న రంగాల్లో నిర్మాణ రంగం ఒకటి. మన దేశం లో సాధారణంగా 'పక్కా' బిల్డింగుల నిర్మాణం కోసం ఇటుకలు, ఇసుక, సిమెంటు, స్టీలును వాడతాం. వీటికి గ్లోబల్ వార్మింగ్కి సంబంధం ఏంటి? చాలా దగ్గర సంబంధం ఉంది.  ఇటుకలు, సిమెంటు, స్టీలు తయారుచేసే క్రమంలో విడుదలయ్యే CO2 గ్లోబల్ వార్మింగ్ని క్రియేట్ చేసే వాయువుల్లో  ప్రధానమయినది. ఇక ఇసుక సహజ సిద్దంగా లభించేదే అయినా,దీనిని నిర్మాణ ప్రదేశానికి తరలించే క్రమంలో విడుదలయ్యే వాయువు కూడా CO2 నే.

అలాగని బిల్డింగులు కట్టుకోకుండా కూర్ఛుంటామా ఏంటి అనుకుంటున్నారా?దీనికి ఒక సింపుల్ పరిష్కారముందండి. మట్టి వినాయకుల్ని పూజించినట్లు మట్టి ఇళ్ళను కట్టుకోవడమే.

















 మట్టి ఇళ్ళు మనకి కొత్తేం కాదు, గ్రామ ప్రాంతాల్లో సుపరిచితమే. వీటిలోని మూలాల్ని ఆకళింపు చేసుకుని, సాంకేతికతను జోడించి నేటి నిర్మాణ అవసరాలకు తగినట్టుగా తీర్చిదిద్దారు శాస్త్రజ్ఞులు, భవన రూప శిల్పులు. మట్టి ఇళ్ళకు, సిమెంట్ ఇళ్ళకు ముఖ్యమైన తేడాలు..

గోడలు: ఇంటిని నిర్మిద్దామనుకున్న స్థలం లోనే పునాదులు వేయడానికి తవ్విన మట్టిని టెస్టింగ్ కొరకు ల్యాబ్ కు పంపిస్తారు. అక్కడ ఆ మట్టి యొక్క సాంద్రతని పరిశీలించి అది నిర్మాణానికి పనికి వస్తుందో లేదో చూస్తారు. ఆ మట్టిని అనువయినది గా నిర్ణయిస్తే దానినే ఈ మట్టి ఇటుకల నిర్మాణం లో వాడతారు. 70 % మట్టి, 30 % సిమెంటు మిశ్రమంతో చేసిన ఈ మట్టి ఇటుకలను సూర్యరశ్మి లోనే 21 రోజులు ఎండ పెట్టి గోడల నిర్మాణములో వాడతారు. ఈ ఇటుకల తయారీ లో ఎక్కడా CO2 విడుదలయ్యే ప్రసక్తే లేదు.

స్లాబు: సాధారణ నిర్మాణాల్లో స్లాబు బరువంతా కాలమ్-బీముల మీదే సపోర్ట్ అయి ఉంటుంది. అందుకే స్లాబు స్థిరముగా ఉండేందుకు అధిక మొత్తం లో స్టీలు ని ఉపయోగిస్తారు. ఈ మట్టి ఇళ్ళలో స్టీలు వాడకాన్ని తగ్గించేందుకు డోములు, వాల్టులు, ఆర్చ్ పానెల్స్ లను వాడతారు. మన సాంప్రదాయ పెంకులు ఉండనే ఉన్నాయి.



ఫ్లోరింగు: దీనిలో కూడా మట్టి తో చేసిన టైల్స్ నే వాడతారు. ఇవి టెర్ర కొట్ట టైల్స్ గా సుప్రసిద్ధం.



నిర్మాణ వ్యయం: సాధారణ బిల్డింగులతో పోల్చితే ఈ మట్టి బిల్డింగుల వ్యయం 10 -15 % తక్కువ.

 మరి కొన్ని మట్టి ఇళ్ళ చిత్రాలు..



 ఈ పైన చిత్రాల్లో చూసిన ఇళ్ళు ఎక్కడివో కావండి, ప్రక్క రాష్ట్రమైన కర్ణాటక లోనివే. మన రాష్ట్రం లో కూడా ఇప్పుడిప్పుడే వీటి నిర్మాణాలు పుంజుకుంటున్నాయి. మీరు వైజాగ్ వారయితే ఆంధ్ర యూనివర్సిటీలోని ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంటుని ఒక లుక్ వేసి రండి. వారి బిల్డింగ్ కూడా ఈ కోవలోనిదే..

మట్టి ఇళ్ళ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ క్రింది లంకెలు చూడండి...